జమ్మలమడుగు నియోజక వర్గం కాల్పుల మోత

కడప జిల్లాలో మరోసారి కాల్పుల మోత ప్రజలను హడలెత్తేసింది. జమ్మలమడుగు నియోజక వర్గం కొండాపురం మండలం టీ కోడూరు గ్రామంలో పవర్ ప్లాంట్‌ నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ క్రమంలో ఓ వర్గం నేత తన రివాల్వర్ తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి నుంచి తుపాకీతో పాటు 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రైతుల భూములను తీసుకున్నారు. ఈ నిర్మాణానికి పవన్ కుమార్ రెడ్డి గ్రావెల్ తరలిస్తున్నారు. అదే గ్రామానికి రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. సోలార్ ప్లాంట్ పనులు ఇప్పుడే చేపట్టకూడదని చెప్పడంతో సోమవారం సాయంత్రం ఇరువర్గాల వివాదం రాజుకుంది. గ్రావెల్ తోలుతున్న వాహనాలను గ్రామ సమీపంలో అడ్డుకోవడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది మరింత పెరిగి ఇరు వర్గీయులు రాళ్ల దాడి చేసుకున్నారు.

అనంతరం పవన్ కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కానీ రామ్మోహన్ రెడ్డి వర్గీయులు అంతటి ఆగలేదు. పవన్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. రామ్మోహన్ రెడ్డి తన వద్దనున్న లైసెన్స్‌డ్ గన్‌తో పవన్ కుమార్ ఇంట్లో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టీవీ, ఫ్రిజ్ ధ్వంసం అయ్యాయి. ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఇరువర్గాలు పోలీసుల అదుపులో ఉన్నారు. గ్రామంలో లోకి రాకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.