రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల వృద్ధి తగ్గింది – కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుండి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయని , రియల్ ఎస్టేట్ పడిపోయిందని , అనేక ఐటీ కంపెనీ లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్న బిఆర్ఎస్..తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఐటీ రంగం కుదేలైంది. ఐటీ ఎగుమ‌తులు, ఉద్యోగ క‌ల్ప‌న‌లో రాష్ట్ర ప్ర‌గ‌తి క్షీణించింది అని పేర్కొన్నారు.

గ‌డిచిన 6 , 7 ఏళ్లలో తెలంగాణ‌లో ఐటీ ప్ర‌గ‌తి గ‌ణ‌నీయంగా సాగింద‌ని గుర్తు చేసిన ఆయన.. ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో, ఐటీ ఎగుమ‌తుల్లో తెలంగాణ గొప్పగా సాగింద‌ని, కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు ఆందోళ‌న‌కంగా మారుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తాజాగా రిలీజైన ఐటీ ట్రెండ్స్‌ను ప్ర‌స్తావిస్తూ.. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌.. త‌న పోస్టులో ఓ గ్రాఫ్‌ను కూడా ప్ర‌జెంట్ చేశారు. తెలంగాణ ఐటీ ఎగుమ‌తులు త‌గ్గ‌డం తీవ్ర‌మైన ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రీ ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. కొత్త ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న ప‌డిపోయింద‌ని, 2022-23 సంవ‌త్స‌రంతో పోలిస్తే ఆ ఉద్యోగాల నియామ‌కాలు మూడో వంతు ప‌డిపోయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

2022-23 సంవ‌త్స‌రంలో తెలంగాణ‌లో 57,706 కోట్ల ఐటీ ఎగుమ‌తులు జ‌రిగాయ‌ని, కానీ 2023-24లో కేవ‌లం 26,948 కోట్ల ఎగుమ‌తులు మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఇక ఐటీ ఎంప్లాయిమ్మెంట్ గ్రోత్ గ‌ణాంకాల‌ను కూడా ప్ర‌జెంట్ చేశారు. 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాల‌ను తెలంగాణ‌లో సృష్టించార‌ని, కానీ 2023-24 కాలంలో కేవ‌లం 40,285 కొత్త ఉద్యోగాల‌ను మాత్ర‌మే క‌ల్పించిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.