వీధికుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోలేదు: హరీశ్‌ రావు విమర్శ

Govt ignores stray dog ​​attacks: Harish Rao criticizes
Govt ignores stray dog ​​attacks: Harish Rao criticizes

హైదరాబాద్‌: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న నాలుగు రోజుల పసికందును కుక్కలు పీక్కుతిన్న ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిన్న వరంగల్‌లో, అంతకుముందు నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయిందని వాపోయారు.

8 నెలల కాలంలో 343 కుక్కగాటు ఘటనలు జరిగాయన్నారు. వీధి కుక్క‌ల దాడుల‌పై ప‌లుమార్లు హైకోర్టు హెచ్చ‌రించినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతుంటే… ఇలాంటి హృదయవిధారక ఘటనలపై ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం అన్నారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడమనేది సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. కుక్క కాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడంతో పారిశుధ్య నిర్వహణ పడకేసింద‌న్నారు. చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైందన్నారు. మున్సిపలిటీల్లో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేకుండా పోయిందన్నారు. అదే సమయంలో సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా అసలు సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. దీంతో వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.