వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం

వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచేశారు. లీటరుపై రూ.20 వరకు పెరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్​లో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పామోలిన్‌ రేేట్ హోల్‌సేల్‌లో లీటరు రూ.110 అమ్ముతుండగా చిల్లరగా రూ.115 చొప్పున విక్రయిస్తున్నారు. సన్ ఫ్లవర్ ఆయిల్ కొన్ని చిల్లర దుకాణాల్లో లీటరు రూ.140 చొప్పున విక్రయిస్తుండటం గమనార్హం. పూజలకు ఉపయోగించే వివిధ రకాల నూనెల లీటరు ధర మొన్నటి వరకు రూ.109 వరకు ఉండగా, అవి ఇప్పుడు రూ.120కి చేరాయి. ఇలా ఒక్కసారిగా ఆయిల్ ధరలకు రెక్కలు రావడం తో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

దీంతో వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఇది 45-50 రోజులకు సరిపోతాయంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది. మరి కేంద్రం హెచ్చరిక తో ఏమైనా తగ్గుతాయో చూడాలి.