యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తన ఫ్యాన్స్‌ను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతగా త్వరలో ఓ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఫ్యాన్స్ కొంతకాలం ఓపిక పట్టాలని ఎన్టీఆర్ టీమ్ కోరింది. ఇది అభిమానులకు మరింత అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

ఇటీవల జూ.ఎన్టీఆర్‌ను కలవాలని ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ తనను కలవాలనే ఉద్దేశంతో పాదయాత్రలు మొదలుపెట్టడం గమనార్హం. దీనిపై స్పందించిన ఎన్టీఆర్, అభిమానులు అలా పాదయాత్రలు చేయకూడదని, సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను ఎన్టీఆర్ గుర్తిస్తున్నారని, అందుకే వారికి మరింత దగ్గరగా ఉండేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారని టీమ్ తెలిపింది. అభిమానులతో కలిసే ఈ ఈవెంట్ ప్రత్యేకమైన అనుభూతిని అందించనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఆయనను దగ్గరగా చూసే అవకాశాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈవెంట్ తేదీ, ప్రదేశం తదితర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.