Central Govt : ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డీఏ ను రెండు శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నది. డీఏ పెంచడం ద్వారా మొత్తం 1.15 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 50 లక్షల మంది ఉద్యోగులు కాగా, 65 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగనుంది.

పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డీఏ పెంపు
దీనికి ముందు 2024 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు లభించింది. ఇది జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 50 శాతం నుండి 53 శాతానికి పెరిగింది. తాజాగా మరోసారి డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అది 53 నుంచి 55 శాతానికి పెరగనుంది. పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డీఏ పెంపును అందించనున్నారు. ఉగాది పండుగ సమీపిస్తోన్న వేళ డీఏ పెంచడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది అమల్లోకి
ఇప్పుడు పెంచిన డీఏ జనవరి నుంచి అమలులోకి వచ్చినప్పటికీ ఏప్రిల్ శాలరీతో రానుంది. అంటే మే నెలలో ఉద్యోగుల చేతికి అందనుంది. అప్పుడు 3 నెలల ఎరియర్స్‌తో కలిపి ఉద్యోగుల, పింఛన్‌దారులకు ఇవ్వనున్నారు. 8వ వేతన సంఘం ప్రకటించిన తర్వాత డీఏ పెంచడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటు విషయాన్ని వెల్లడించింది కేంద్రం. అయితే ఈ వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వస్తాయి.