Oil Refinery : ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు.

ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోంది
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని ప్రకటించారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమని.. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి.. ఎక్కువ నిల్వ చేస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వివరించారు.
తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది. నిర్మాణానికి సుమారు రూ.95 వేల కోట్ల వ్యయం అవసరమని అంచనా వేస్తున్నారు. ఏపీలో తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీపీసీఎల్ అధికారులు తెలిపారు. దేశంలోని ఆయిల్, పెట్రో కెమికల్ రిఫైనరీల్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పాటుచేసే ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం భూసేకరణ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ఫీడ్ బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల కింద రూ.6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
Read Also: డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్…