ఏపీ ప్రభుత్వం పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధించే దిశగా.. వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా రెండో శనివారం, ఆదివారాల్లో పదో తరగతి విద్యార్థులకు టీచర్లు తరగతుల్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందిస్తోంది. దీంతో విద్యార్థులకు ఇళ్ల నుంచి క్యారియర్ తెచ్చుకునే బాధను తప్పించింది. ఈ నెల 2వ తేదీ (ఆదివారం) నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా సెలవు రోజుల్లో భోజనంం అందిస్తున్నారు.

డిసెంబరు 1, 2024 నుంచి వంద రోజుల ప్రణాళికను పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ విద్యార్థులకు సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగన్నర గంటల వరకు ప్రత్యేక తరగతులతో పాటుగా వారిని చదివిస్తున్నారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులతో పాటుగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. జనవరి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాన్ని అందిస్తున్నారు.
దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు భోజనం తెచ్చుకోలేక ఇబ్బందిపడుతున్నారు.. సాయంత్రం వరకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి మార్చి నెల 10 తేదీ వరకు సెలవురోజుల్లోనూ మధ్యాహ్న భోజనం స్కూల్లోనే అందిస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది.