గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు..ఎప్పటి నుండి అంటే ..!!

రైల్వే ట్రాక్ పనుల కారణంగా గత కొద్దీ నెలలుగా సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ రూట్లలో నిత్యం పలు రైళ్లను రద్దు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ట్రైన్ నడుస్తుందో..ఏ ట్రైన్ నడవదో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరోసారి పలు రైళ్లను రద్దు చేయబోతున్నట్లు దక్షణ మధ్య రైల్వే తెలిపింది.

ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. వీటితోపాటు సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఈ సర్వీసులను కొన్నిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైను పనుల కారణంగా ప్రయాణికులకు రైళ్ల సేవల్లో అంతరాయం కలగుతుందని పేర్కొన్నారు.

రద్దయిన రైళ్లు..
ఈ నెల 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో పుణె-సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, జూలై 29, 31న సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.
జూలై 30, 31న సికింద్రాబాద్‌-ముంబై, ముంబై-సికింద్రాబాద్‌ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌
ఈ నెల 31న నిజామాబాద్‌-పుణె ఎక్స్‌ప్రెస్‌
ఆగస్టు 5 నుంచి 10 వరకు విజయవాడ-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, డోర్నకల్‌-విజయవాడ, విజయవాడ-డోర్నకల్‌ రైళ్లు, విజయవాడ-సికింద్రాబాద్‌‌-
విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్‌‌-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి.
హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్‌-గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్‌-తిరుపతి తిరిగే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పలు రైళ్లను దారి మళ్లించారు.