భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉదృతి

భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి మరోసారి భారీగా పెరుగుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు నీటి మట్టం 51.1 అడుగులుగా నమోదయింది. ఎగువ నుంచి వెల్లువెత్తుతున్న వరద ఉధృతితో భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది. కాలేశ్వరంలో పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకోవటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం నుంచి గోదావరి పెరుగుతూ వస్తుంది.

53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా, ఛత్తీస్ గడ్ కు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవే పై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులు కావడం గమనార్హం. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గేట్లు ఎత్తివేత కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరుకానున్నారు. నేడు పోతిరెడ్డిపాడు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తనున్నారు. మరో రెండు రోజుల్లో మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి కూడా ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. మరోవైపు సుంకేసుల ప్రాజెక్టు 28 గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.