మరికాసేపట్లో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి 12,58,826 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.60 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏ క్షణానైనా మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అధికారులు లోతట్టు ప్రాంతా వాసులను అప్రమత్తం చేస్తున్నారు.

రామయ్య పాదల చెంత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు కరకట్ట పనుల వద్దకు చేరింది. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీలోకి క్రమంగా వరద నీరు చేరుతున్నది. భద్రాచలం-కూనవరం రోడ్డుపైకి వరదనీరు చేరింది. దీంతో భద్రాచలం నుంచి విలీన మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం శివారులో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ఇక దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.