మహారాష్ట్రలో గిలియన్-బార్ సిండ్రోమ్ (GBS) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 183కు చేరుకుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. అయితే, 151 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని స్వస్థత పొందడం కొంత ఊరట కలిగించే విషయం. ఇటీవల ముంబైలో కూడా GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె అంధేరి తూర్పు ప్రాంతానికి చెందినవారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు వెలుగు చూడటంతో మహారాష్ట్రలో GBS వ్యాప్తిపై మరింత అప్రమత్తత పెరిగింది. GBS కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ వ్యాధికి సంబంధించిన అవగాహన పెంచేందుకు వైద్యాధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువ వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
GBS లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఈ వ్యాధి వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఉత్పన్నమవుతుందని వైద్యులు చెబుతున్నారు. గిలియన్-బార్ సిండ్రోమ్ విషయంలో ప్రాథమిక దశలోనే వైద్యం అందించడం ఎంతో ముఖ్యమని, ఆలస్యం చేస్తే సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో త్వరలోనే పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నారు.