టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్

భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్- భారత జట్టు హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. అతని నియామకాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ (BCCI) మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ని నియమించడం జరిగిందని, అతడు రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని వెల్లడించింది. ఆగస్టులో శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లతో అతడు ప్రధాన కోచ్‌గా రంగంలోకి దిగబోతున్నాడని ఖరారైంది.

కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం జూన్ 30తో ముగిసింది. దీంతో బీసీసీఐ నెక్స్ట్ భారత్ కోచ్ కోసం వేట మొదలుపెట్టి ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న గౌతీ.. ఇంటర్వ్యూకు సైతం హాజరయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో మొదటి నుండి ముందు వరుసలోనే ఉంది.

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఫిక్స్ అయిందని.. అధికారిక ప్రకటనే తరువాత అని గత కొద్ది రోజులుగా క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ టీమిండియా నెక్ట్స్ హెడ్ కోచ్‌గా గంభీర్ పేరును బీసీసీఐ అఫిషియల్‌గా ప్రకటించింది.