నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

ప్రజాగాయకుడు , విప్లవ కారుడు గద్దర్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ..హైదరాబాద్ అపోలో లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆదివారం ఆయన ఆరోగ్యం విషమంగా మారి కన్నుమూశారు.

సాయంత్రం గద్దర్‌ భౌతికకాయాన్ని హాస్పటల్ నుండి ప్రజలు, అభిమానులు, ఉద్యమకారుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై వెంకటాపురంలో ఉన్న మహాబోధి పాఠశాలకు చేరుకుంటుంది. గద్దర్‌ కోరిక మేరకు స్కూల్‌ మైదానంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు.

‘జీవితాంతం ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్‌ కుటుంబసభ్యులతో మాట్లాడి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. గద్దర్ ను కడసారి చూసేందుకు రాజకీయ నేతలు , ప్రజా సంఘాలు , అభిమానులు తరలివస్తున్నారు.