ప్రకాశం బ్యారేజీకి మరింత తగ్గిన వరద

విజయవాడ లో 30 ఏళ్ల రికార్డు ను బ్రేక్ చేస్తూ వర్షాలు పడ్డాయి. ఒక్క రోజే దాదాపు 29 సెం. మీ వర్షం పడడంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. నగరం మొత్తం వరదలో చిక్కుకుంది. ఇప్పుడెప్పుడే నగర వాసులు బయటకు వస్తున్నారు. మరోపక్క ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ఉద్ధృతి తగ్గుతోంది. నిన్న 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.79 లక్షలుగా ఉంది. 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అటు తెలంగాణ నుంచి వచ్చే మున్నేరు నదికి సైతం ప్రవాహం తగ్గింది. దీంతో లంక గ్రామాలకు వరద ముప్పు తగ్గుతోంది.

ఇక బుడమేరు వరద విజయవాడ ప్రజల జీవితాల్లో విషాదాన్ని నింపింది. దాని ఉద్ధృతికి తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. గుణదలకు చెందిన వెంకటేశ్వరరావు (63), ఆయన కుమారుడు సందీప్ (35) ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్లినవారు సోమవారం ఉదయానికీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు అక్కడికెళ్లి చూడగా వరద నీటిలో వారిద్దరి మృతదేహాలు కనిపించాయి. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

భారీ వర్షాలు, వరదలకు 19మంది మరణించగా, ఇద్దరు గల్లంతైనట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 136పశువులు మృతి చెందినట్లు తెలిపారు. ఇక 1,808KM మేర రోడ్లు నాశనమైనట్లు పేర్కొంది.