ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం వద్ద భారీగా వరద వచ్చి చేరుతోంది. నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయానికి పరిస్థితి మారిపోయింది. రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక ఉంటే ఈరోజు ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక దాటేసింది. గంటల వ్యవధిలోనే గోదావరి ప్రవాహం పెరుగుతోంది. దాదాపు నెల రోజుల విరామం తరువాత గోదావరి మరోసారి ఉప్పొంగుతోంది.

ఎగువ నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దఎత్తున నీరు చేరుతోంది. ఒక్క రాత్రిలోనే 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు చేరింది. నిన్న రాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12.10 అడుగులుండగా 10 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి. కానీ గోదావరికి భద్రాచలం దిగువన శబరి నది పోటెత్తుతూ గోదావరిలో వచ్చి కలుస్తుండటంతో భారీగా వరద పెరిగింది. పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.

వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గోదావరి మహోగ్రరూపంతో జలదిగ్బందంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఉన్నాయి. కాజ్ వేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజేవేలు నీట మునిగాయి. నాటుపడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు సెలవులు ప్రకటించారు. ఆలమూరు మండలంలోని లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. సీతానగరం మండలంలోని ములకల్లంక, రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.17 చోట్ల ఇంజన్ బోట్లను అధికారులు ఏర్పాటు చేశారు