విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ – భట్టి

రాష్ట్రంలోని మొత్తం 27 వేల 862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గురువులకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. మంచి సమాజ నిర్మాణానికి పునాదులు వేసేది ఆదర్శ గురువులేనని కొనియాడారు. గురువులు ఎంత గొప్ప వాళ్లైతే.. సమాజం అంత గొప్పగా ఉంటుందన్నారు.

మన విద్యావ్యవస్థ ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా లేదన్నారు. మన విద్యావ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్రంలోని ఐఐటీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. మన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఆదర్శమైన గురువులు ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను వారు చాలా చక్కగా అమలు చేస్తున్నారని కితాబునిచ్చారు. ఇంగ్లీష్ మీడియంను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు.