కేంద్ర బడ్జెట్‌ పై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు

KTR

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్ర బడ్జెట్‌ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్‌ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే” అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్‌ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు.

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు.