ఏపి రాజధాని నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు: మంత్రి నిర్మల

For construction of AP Capital Rs. 15 thousand crores: Minister Nirmala

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్-2024లో ఆంధ్రప్రదేశ్‌కు కీలక కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. రానున్న ఏళ్లలోనూ సాయం అందుతుందన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతులు, దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు.. ప్రకాశం జిల్లాకు సాయం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని చెప్పారరు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అనుసరించి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మిగతా 8 నెలల కాలానికి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చెప్పినట్లుగానే పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మధ్యంతర బడ్జెట్లో చెప్పినట్లుగా ఇప్పటికే రైతలు కోసం అన్ని ప్రధాన పంటలకు అధిక కనీస మద్దతు ధరలు ప్రకటించినట్లు ఆమె చెప్పారు. 80 కోట్ల మందికి లబ్ధి కలిగేలా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అయిదేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. 4.1 కోట్ల యువతకు అయిదేళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలతో అయిదు పథకాలు తెస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం వచ్చే రెండేళ్లలో అధిక దిగుబడులిచ్చే, వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. 32 రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఈ కొత్త వంగడాలను తీసుకొస్తామన్నారు.