ఏఆర్ డెయిరీలో కేంద్రం తనిఖీలు

తిరుమలకు గతంలో ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని దిండుగల్ ప్లాంటులో సుమారు రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు. కాగా ఈ సంస్థ తిరుమలకు పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బ్లాక్ లిస్టులో పెట్టామని టీటీడీ ఈవో చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

మరోపక్క తిరుమలకు పంపే ‘నందిని’ ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్ను ఓపెన్ చేయలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. టీటీడీకి నెల రోజుల క్రితం నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.