హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి

హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను , వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పడబోతున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్‌ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు.

ఈ ఫ్లైఓవర్‌కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మించే ప్రదేశం
గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరింత వేగంగా జరిగేందుకు చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్‌ నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్‌ కన్‌స్ట్రక్షన్స్‌..నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.