భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి

భద్రాచలం వద్ద ఉప్పొంగి ప్రవహించిన గోదావరి నిన్న రాత్రి నుంచి శాంతిస్తోంది. మంగళవారం ఉ. 10 గంటల వరకు 51.60 అడుగులకు చేరుకున్న నీటిమట్టం రాత్రి 9 గంటల నాటికి 50.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 47.10 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. దీంతో చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అటు ధవళేశ్వరం వద్ద కూడా ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.

ఎగువన భారీ వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కావడం వంటి కారణాలతో భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తిన విషయం విదితమే. క్రమేపీ పెరుగుతూ రెండో ప్రమాద హెచ్చరికను కూడా దాటి ప్రవహించింది. అయితే, మంగళవారం ఉదయం 10 గంటల వరకు 51.60 అడుగులకు చేరుకున్న గోదావరి ప్రవాహం.. ఆ తరువాత రెండు గంటల పాటు నిలకడగా కొనసాగింది. 11 గంటల నుంచి గంటకు ఒక్కో అంగుళం చొప్పున తగ్గడం ప్రారంభించింది. రాత్రి 7 గంటలకు 50.10 అడుగులకు తగ్గింది. దీంతో భద్రాచలం పట్టణ వాసులతోపాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వరద ప్రవాహం ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

వరద ముంపులో ఉన్న గ్రామాలకు వైద్య బృందాలు చేరుకున్నాయి. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలను ఇప్పటికే వరదనీరు చుట్టుముట్టడంతో అక్కడ పారిశుధ్య లోపించే ప్రమాదం ఉన్నందున వైద్యబృందాలు అక్కడికి వెళ్లి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణులను ముందస్తుగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.