Fishing Ban : ఏపీలో సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ … కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సాంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

20 వేలు ఇస్తామంటూ వాగ్దానాలు
2023–24లో వేట నిషేధ భృతి కింద బందరు, దివిసీమ తీరప్రాంతాల్లో 12,748 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రతిపాదించారు. వేట నిషేధ భృతి కింద 12,151 మంది బ్యాంక్ ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌సీపీ హయంలో రూ.10 వేలు చొప్పున నేరుగా రూ12.15 కోట్లు జమచేశారు. 2024–25 వేట నిషేధ భృతి క్రింద 12,809 మంది మత్స్యకారులను గుర్తించారు. సుమారు 12.89 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో భృతి అందలేదు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధభృతి రూ 20 వేలు ఇస్తామంటూ వాగ్దానాలు చేసింది.
సముద్రంలో 61 రోజుల పాటు వేట నిషేధం
ఇప్పటివరకు గతేడాది భృతి మంజూరవకపోవడం మత్స్యకారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రెండునెలల విరామానికి బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు వేట నిషేధం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Also: త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ?