అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ ధర పలికిన పులస చేప

పులస చేప కు ఎంత డిమాండ్ ఉంటుందో తెలియంది కాదు. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అని పెద్దలు అంటుంటారు. చాల అరుదుగా దొరికే ఈ చేప ను ఒక్కసారైనా రుచి చూడాలని చాలామంది భావిస్తారు. ఇక దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతుండడం తో ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్రనీరు వచ్చిందంటే..పులసల సీజన్‌ వచ్చేసినట్టే.. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు.

ఆషాఢం కొత్త అల్లుళ్లకు, బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈక్రమంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. ఈ విషయం తెలిసిన వెంటనే చాలామంది చేప ను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. కేజీన్నర బరువున్న ఆ పులసను అప్పనరామునిలంకకు చెందిన మాజీ సర్పంచ్‌ బర్రె శ్రీను రూ.24,000లకు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులసకూరను బంధువులందరితో షేర్‌ చేసుకుంటున్నారు.