ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు బయట రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షలు పడుతుండడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోవడంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బ్యారేజ్ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి 9లక్షల86వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలంటే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నాలుగు ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీటి ప్రవాహానికి కాజ్ వేలు నీటమునిగాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కాజ్ వే నీట మునిగి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల వరద బాధితులు కాజ్ వేలపై ఉన్న వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఉధృతికి చాకలి పాలెం – కనకాయలంక కాజ్ వే నీట మునిగింది. దీనితో భీమవరం – కోనసీమ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజల రాకపోకలకు ఇంజన్ పడవలు ఏర్పాటు చేశారు. ఇటు చింతూరు – భద్రాచలం ప్రధాన రహదారిపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహయచర్యలు అందించేందుకు లాంచీలతో పాటు బఫ్ఫర్ స్టాక్ ను అధికారులు ఏర్పాటు చేశారు. దేవీపట్నం మండలం, సీతానగరం మండలాలపై వరద ప్రభావం తీవ్ర స్థాయి ఉంది.