హైదరాబాద్: గత రాత్రి హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు దగ్ధమవగా ఒక్క బోటులో స్నేహితులు తో వెళ్లిన అజయ్ (21) అనే యువకుడు కనిపించడం లేదు. అజయ్‌తోపాటు వెళ్లిన స్నేహితులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అజయ్ ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజయ్ స్నేహితులు నుంచి లేక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

కాగా, భరతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు బోట్లలో బాణసంచా పేల్చడానికి కొందరు యువకులు రెండు బోట్లలో హుస్సేన్‌సాగర్ మధ్యలోకి వెళ్లారు. బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వులు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పురవ్వలు తిరిగి అవే బోట్లలో ఉంచిన బాణసంచాపై పడటంతో బోట్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బోట్లు దగ్ధం కాగా.. అందులో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నగరానికి చెందిన అజయ్ తన కొలిగ్స్‌తో కలిసి హుస్సేన్‌సాగర్‌కు వచ్చాడు. అయితే బోట్స్‌లో అజయ్ ఉన్నట్లు ఫ్రండ్స్ చెబుతున్నారు. బోట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్నవారు అందరూ నీటిలోకి దూకారు. అదే సమయంలో అజయ్‌తోపాటు అతని స్నేహితులు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే అజయ్ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ ఎక్కడా ఏ ఆస్పత్రిలో జాయిన్ కాలేదని.. ఇదే విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేశారు. అజయ్ అనే పేరుతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ కాలేదని, క్షతగాత్రుల వివరాల్లో అజయ్ పేరు లేదని పోలీసులు తెలిపారు. దీంతో అజయ్ ఏమయ్యాడనే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు