ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు కన్నుమూత

టాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో బుధవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాలకి ఆయన మాటలు అందించారు.

‘ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు ‘ అంటూ నరసింగరావు రాసిన సినిమాలోని డైలాగ్స్‌ కూడా విశేష ఆదరణ పొందాయి. నరసింగరావుకి భార్య, కుమార్తె ఉన్నారు. పాతబస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చికుచ్చి కూనమ్మా వంటి సినిమాలకి కూడా మాటల రచయితగా పని చేశారు. సినిమాల్లోకి రాక ముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపుని పొందిన నరసింగరావు ఒకప్పుడు దూరదర్శన్‌ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్‌కి కూడా రచయితగా చేశారు. అలాగే ఈ టీవీ లో ఫేమస్‌ సీరియల్స్‌ గా గుర్తింపు పొందిన వండర్‌ బోరు, లేడీ డిటెక్టవ్‌, అంతరంగాలు వంటి సీరియల్స్‌ కి కూడా మాటలందించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.