కాసేపట్లో మంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్న సినీ నిర్మాతలు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి, పలుశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చర్చించేందుకు సినీ నిర్మాతలు విజయవాడలోని క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. గత ప్రభుత్వంలో తెలుగు నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. తమ ఇబ్బందులను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి అశ్విని దత్, హారిక హాసిని క్రియేషన్స్ నుంచి చిన్నబాబు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్, రవి శంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరపున విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి డివివి దానయ్య లతో పాటు తెలుగు ఫిలిమ్స్ అంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర ప్రసాద్, భోగవల్లి ప్రసాద్ తదితరులు పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు.

విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈ మీటింగ్ జరగబోతోంది. కొత్తగా పవర్ లోకి వచ్చిన కూటమికి.. నిర్మాతలు అభినందనలు కూడా తెలుపనున్నారు. ఈ మీటింగ్ లో నిర్మాతలు గత ప్రభుత్వంలో వాళ్లు ఎదుర్కొన్న ముఖ్య ఇబ్బందుల గురించి వివరించి, ప్రస్తుతం తమకున్న సమస్యలను కూడా తెలియజేయబోతున్నారు. అంతేకాకుండా తమ సమస్యలకు.. పరిష్కారం చూపించాలని పవన్ కళ్యాణ్ ను కోరనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాతలు చెప్పిన విషయాలను ఆలోచించి, వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు.