వినాయకుడి స్త్రీ శక్తి రూపం గురించి తెలుసా..?

వినాయకచవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరూరా, వాడవాడనా మండపాలు వెలిశాయి. గణపతి విగ్రహాలు కూడా మండపాలకు చేరుతున్నాయి. ఇక మిగిలింది ప్రతిష్ఠించడమే. అయితే, చవితి వేడుకలంటే ఆటపాటల సంబరాలే కాదు..వినాయకుడి ప్రతిమ, వినాయక పూజ గురించి తెలుసుకోవడం తో పాటు వినాయకుడి రూపాలు కూడా తెలుసుకోవాలని అంటున్నారు. వినాయకుడి స్త్రీ శక్తి రూపం ఉందనే విషయం మీకు తెలుసా..?

త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్లకు స్త్రీ శక్తిరూపాలున్నాయి. అలాగే వినాయకుడికీ ఉంది. పూర్వం పార్వతీదేవిని అంధసారుడు మోహించగా, శివయ్య అతడిని త్రిశూలంతో చీల్చేస్తాడు. అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతి అందరు దేవుళ్లూ ఏకంకావాలని పిలుపునిస్తుంది. ఆ క్రమంలోనే వినాయకుడి నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటికొస్తుంది. ఈమెను గణేశ్వరి, వినాయకి అని పిలుస్తారు.

వీటిలో వినాయకుడి నుంచి వెలుపలికి వచ్చిన శక్తి రూపం వినాయకి. ఈమెనే గణేశ్వరి, విఘ్నేశ్వరి అని కూడా పిలుస్తారు. వినాయకుడికి సంబంధించి ఈ స్త్రీ శక్తి రూపం అవతరణ గురించిన వివరణ వనదుర్గ ఉపనిషత్తులో ఉంది. మధ్యప్రదేశ్‌లో నర్మద నదీతీరంలోని బేడాఘాట్‌ దగ్గర చౌసట్‌ యోగిని దేవాలయం ఉంది. ఈ ఆలయంలో 64 మంది యోగినుల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఏనుగు ముఖం కలిగిన వినాయకి విగ్రహం కూడా ఒకటి.