రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతన్నలు

3వ విడతలోనూ తమకు రుణమాఫీ కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చెపుతూ..సీఎం రేవంత్ దిష్టి బొమ్మలను దహనం చేయడం , శవయాత్రలు చేస్తూ తమ నిరసన ను తెలియజేస్తున్నారు. అంతే కాకుండా రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల రైతులు నిరసనకు దిగారు. ఆదిలాబాదు లో CM దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. కర్మకాండ కుండలతో మహారాష్ట్ర బ్యాంకులోకి వెళ్లి CM డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. కరీంనగర్ లోని కొత్తపల్లి మండలంలో ఇండియన్ బ్యాంక్ను రైతులు మూసేశారు.

ఒకే దఫాలో చేస్తానన్న రుణమాఫీని మూడు దశల కిందికి మార్చినా, ఇవాళ కాకపోతే రేపైనా అవుతుందని పంద్రాగస్టు దాకా ఓపికగా వేచిచూసిన అన్నదాతలు.. ఇది మాఫీ కాదు, మోసమని గుర్తించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ, ఎవరికి వారుగా ముందుకు కదిలా రు. శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, అధికారుల నిలదీతలు, ఆత్మహత్యాయత్నాలు, రాస్తారోకోలు ఇలా ఎవరికి తోచిన రూపంలో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.