తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తమ భూమిని ఆక్రమించారని చెప్పి రీసెంట్ గా ఖమ్మం జిల్లాలో ఓ రైతు లైవ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా..తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. మంత్రి పొంగులేటి ఇలాఖాలో ఈ దారుణం జరిగింది. జాన్ పహాడ్ తండాలో తన భూమి ఆక్రమణకు గురైందంటూ మనస్తాపంతో గత ఆదివారం పురుగుల మందు తాగిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తెల్లవారు జామున మృతి చెందాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

2019 నుంచి ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలోని ఓమూడెకరాల భూమి విషయంలో జాటోత్ వీరన్నకు అదే గ్రామానికి చెందిన ఏలేటి వెంకటరెడ్డికి మధ్య వివాదం జరుగుతోంది. గతంలో వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి తన వద్ద తీసుకున్న అప్పు చల్లించలేదంటూ భూపాల్ రెడ్డి భూమిని కొనుగోలుచేసినట్లు వీరన్న తెలిపాడు. రెవెన్యూ అధికారుల సహాయంతో సరిహద్దులు మార్చుకున్నానన్నాడు. అయితే తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటూ 2021లో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి. దీంతో తమ వ్యవసాయ భూమిని కబ్జా చేశాడంటూ జాటోత్ వీరన్న సహా అతడి కుటుంబసభ్యులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు వెంకట్ రెడ్డి. ఈ క్రమంలో జాటోత్ వీరన్న సహా అతడి కుటుంబ‌ సభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.

అయితే పోలీసులు కేసు నమోదు చేసినా వీరన్న తీరు మారకపోగా.. ఈనెల 4న మరో మారు తన కుటుంబసభ్యులతో కలిసి వివాదాస్పద భూమిలో సాగుపనులు చెపట్టాడు. దీంతో మనస్తాపంతో పొలం వద్దే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంకట్ రెడ్డి. మృతుడు వెంకట్ రెడ్డి భార్య ఏలేటి లక్ష్మీ ఫిర్యాధు మేరకు జాటోత్ వీరన్న సహా మరో ఐదుగురిపై ఖమ్మం రూరల్ పోలీసులు కేసునమోదు చేశారు.