రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈ పథకంలో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధం లేదని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలలో ఒకటిగా ఈ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రైతు డిక్లరేషన్‌లోనూ చెప్పింది.
అయితే, దఫదఫాలుగా సాయాన్ని పెంచుమతాని చెబుతోంది ప్రభుత్వం. జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా పథకం కింద రూ. 12 వేలు ఇస్తామని తాజాగా ప్రకటించింది ప్రభుత్వం.

హామీకీ, ఆచరణకు పొంతన లేకపోవడంపై అభ్యంతరం చెబుతోంది తెలంగాణ రైతు సంఘం. ”అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగం ఓట్లు ఆకర్షించేందుకు మేనిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది.కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేసి, దాని ఆధారంగా 26వ తేదీ నుంచి రైతు భరోసా సాయం అందించనున్నారు.