తెలంగాణలో ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన “కుటుంబ సర్వే” పత్రం ఇప్పుడు రాజకీయ వివాదాస్పదంగా మారింది. ఈ సర్వేలో అనేక తప్పులున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో విమర్శించారు. ఈ వ్యాఖ్యల అనంతరం, ఆ పీడీఎఫ్ ఫైల్ వెబ్‌సైట్ నుంచి తొలగించబడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ అంశాన్ని బీఆర్ఎస్ యువ నాయకుడు క్రీశాంక్ ట్విట్టర్‌లో హైలైట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని “కుటుంబ సర్వే” డాక్యుమెంట్ ప్రస్తుతం అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్, సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ సెటైర్లు వేశారు.

“చాలా బాగా చేశారు. అద్భుతమైన ప్రదర్శన” అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం అనేక సర్వేలు చేపడుతుండగా, ఈ “కుటుంబ సర్వే”లో తప్పుడు డేటా ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ఇక తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికార ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు. సర్వేను పూర్తి స్థాయిలో అప్‌డేట్ చేయడానికే వెబ్‌సైట్ నుంచి తాత్కాలికంగా తీసేశామని చెబుతున్నారు. అయితే, ఈ వివాదంపై అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
సమస్య ఏదైనా, “కుటుంబ సర్వే” తొలగింపు ఇప్పుడు రాజకీయం అవుతోంది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకత్వం దీన్ని ప్రభుత్వ పరిపాలనా వైఫల్యంగా ప్రచారం చేయాలని చూస్తోంది. మరోవైపు, తెలంగాణ ప్రజలు అసలు ఈ సర్వేలో ఏమి తప్పులున్నాయి?, అది తిరిగి అప్‌డేట్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టుతారా? అనే ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు.