ఏపీలో 7 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి కృషి – కేంద్ర మంత్రి రామ్మోహన్

రాష్ట్రంలో 7 ఎయిర్పోర్టులు ఉండగా, కొత్తగా మరో ఏడింటిని నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలు పెంచుతున్నాం. శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో ఎయిర్పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తాం’ అని తెలిపారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భేటీ వివరాలను వెల్లడించారు. ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్‌ సామర్థ్యం పెంపు పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్మినల్‌ పనులు జరుగుతున్నాయన్న రామ్మోహన్ నాయుడు.. పనులను త్వరగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మాణంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.