ఎన్‌కౌంటర్‌..రెండు వేర్వేరు చోట్ల ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter..Three terrorists killed in two different places

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. కుప్వారా లోని మచిల్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చారు. అదేవిధంగా కుప్వారాలోని తంగ్‌ధర్ సెక్టార్‌లో ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. బుధవారం రాత్రి సమయంలో తంగ్‌ధర్‌ సెక్టార్‌లో ఉగ్రవాద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ చేపట్టారు. మరోవైపు ఇద్దరు నుంచి ముగ్గురు ముష్కరుల కదలికలు కన్పించడంతో మచిల్ సెక్టార్‌లోనూ 57 రాష్ట్రీయ రైఫిల్స్ (RR) దళం అప్రమత్తమై ఆపరేషన్ చేపట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

మరోవైపు, రాజౌరీ జిల్లాలోని లాఠీ గ్రామంలో మూడో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. అక్కడ నలుగురు ముష్కరులు నక్కి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లాఠీ గ్రామం, దంతాల్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.