ఎన్నికల సంస్కరణలు రావాలి!

నిర్బంధ ఓటింగ్‌ విధానం అవసరం

Electoral reforms should come
Electoral reforms should come

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం మనది. సుమారు 140కోట్ల జనాభాలో ప్రస్తుతం 98 కోట్ల ఓటరు మహాశయులకు నిలయం మనది. రేపటి 2021 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని కలుపుకొని కొత్త ఓటర్‌ లిస్టు ప్రచురిస్తే సరిగ్గా వంద కోట్ల ఓటర్లకు చేరుకునే అవ కాశం ఉంది. అందుకే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా పేరొందింది. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రతినిధులుగా పంచాయతీ సభ్యులు మొదలుకొని పార్లమెంట్‌ మెంబర్‌ దాకా ఎన్నుకుంటాం.కానీ ఇందులో ఎంత శాతం ప్రజాస్వామ్యం ఇమిడి ఉంది.

ఎంత శాతం ప్రజలు ఓటు వేస్తున్నారని ఆలోచిస్తే మన ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నెయ్యిసామెత లాగానే మిగిలి పోతుంది. డిసెంబర్‌ ఒకటిన జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికలలో ఘనమైన హైదరాబాద్‌ నగర ఓటర్లు ఓటు వేయడంలో ప్రదర్శించిన నిరాసకత్త నిర్లిప్తత మరొకసారి ఈ చర్చకు దారితీసింది. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లు పట్టణ ఓటర్ల కంటే నగర ఓటర్లు ప్రజాస్వామ్యం వల్ల అపనమ్మకంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాలను వెల్లడించడానికి ఓటు ఒక అద్భుతమైన అవకాశమనీ వారు తెలుసుకోలేకపోతున్నారు. మన ఓటుతో అధికారంలోకి వస్తున్న పార్టీలు ప్రభుత్వాలు మనం చెల్లించే పన్నుల డబ్బులతో పాలిస్తాయని అర్థం చేసుకుంటే ఓట్ల పట్ల నిర్లిప్తత ఉండదు. వాతావరణాన్ని గురించి అందరూ మాట్లాడుతారు కానీ దాన్ని బాగు చేయడానికి అవసరమైన నివారణ చర్యలు ఎవరు తీసుకోరు అనే సామెత లాగే ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య భావన గురించి ఓటు హక్కు గురించి గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చేవారే ఓటుహక్కును వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరు గెలిస్తే మనకి ఏమిటి? ఎవరు ఓడితే మనకు ఏమిటి? అని ప్రజాస్వామ్యం పట్ల నిర్లిప్తతో ఉంటున్నారు.

తాము ఓటు వేయకపోయినా గెలిచినవారు అధికారంలోకి వస్తారని, వారి ఏలుబడితో తాము తప్పనిసరిగా మగ్గవలసి వస్తుందనే చేదు నిజాన్ని వారు గమనించడం లేదు. అందుకే ప్రజాస్వామ్యంలో మేధావ్ఞల మౌనం వల్ల నష్టం వారికి ఒక్కరికే కాదు దుర్మార్గ పరిపాలనలో అందరు ప్రజలు మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న నిజాన్ని ఓటు వేయని వారు తెలుసుకున్న రోజు ప్రజాస్వామ్యం అర్థవంతమవ్ఞతుంది. కానీ పిల్లి మెడకు గంట కట్టేదెవరు అన్న చందాన చదువ్ఞకున్నవారే ఓటు వేయడం లేదు. దాంతో పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది.

జవాబుదారీతనం లోపిస్తుంది. ప్రజలకు ఉచిత తాయిలాలు ఇచ్చి ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తరలిస్తే సరిపోతుందన్న భావం పార్టీలలో పెరుగుతుంది. ప్రశ్నించేవారు అడిగేవారు లేకపోతే ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చన్న భావన ప్రభుత్వాలకు కలుగుతుంది. ప్రజాస్వామ్యం బదులు ‘ఆటోక్రసి పెరుగుతుంది. అంతిమంగా ఇది ప్రజాస్వామ్య ‘వాహనానికి ఆ తర్వాత ప్రజాస్వామ్య ‘మరణానికి దారి తీస్తుంది. సమస్య వర్ణనకాదు పరిష్కారాలు ఆలోచించాలి. ఓటర్ల నిర్లిప్తత అనే ఏనుగంత సమస్య మన కళ్లముందు కనపడుతుంది. ఈ సమస్య వర్ణన కంటే పరిష్కారాలవైపు ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే మొదట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాతావరణం కల్పించాలి. ఓటరు లిస్టులను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలి.

ఒకే ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉండే విధానాన్ని సవరించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వీటిని ఏరి వేయాలి. నూతన సాంకేతిక ఆవిష్కరణలతో కూడిన ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ప్రవేశపెట్టాలి. ఓటింగ్‌ ప్రక్రియను మరింత సుల భతరం చేయాలి. రాజకీయ,ఎన్నికల సంస్కరణలు జరపాలి. పార్టీలు కుటుంబ ప్రైవేట్‌ ఆస్తులుగా మారిపోయాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి. అభ్యర్థుల ఎంపిక మరింత ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. ప్రస్తుతమున్న పాస్ట్‌ ద పోస్ట్‌ ఎన్నికల విధానాన్ని సమూలంగా మార్చాలి. దామాషా పద్ధతి ఎన్నికల విధానాన్ని తీసుకురావాలి.

గెలుపు గుర్రాలకు బదులు పార్టీలకు పడిన ఓట్లశాతాన్ని బట్టిసీట్లు కేటాయించాలి. పంచాయతీ, మున్సిపాలిటీ, మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్షులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కూడా ప్రత్యక్ష ఎన్నిక జరపాలి. రాష్ట్రాల అసెంబ్లీ దేశ పార్లమెంట్‌ను శాశ్వత సభలుగా ప్రకటించాలి.నిర్బంధ ఓటింగ్‌కు సమయం ఆసన్నమైంది.

ప్రపంచంలో ఇప్పటికే 20దేశాలలో ఉన్న నిర్బంధ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి.ఈ ప్రయోగం అమలు మనవద్ద ఎంత వరకు అమలు జరుగుతుందో ప్రయోగాత్మకంగా పరిశీలించాలి.ప్రజాస్వా మ్యాన్ని ఎవరూ ప్రత్యేకించి హత్య చేయలేరు. కానీ ప్రజాస్వామ్యం పట్ల ప్రజల ఉదాసీనత, నిర్లక్ష్యభావం,నిర్లిప్తత వల్ల ప్రజాస్వామ్యం మెల్లమెల్లగా కనుమరుగైపోతుందన్న అమెరికన్‌ తత్వవేత్త విశ్లేషణ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

  • బండారు రామ్మోహనరావు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/