ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ నివాసంలో ఈడీ సోదాలు

ED searches at residence of ex-principal RG Kar

కోల్‌కతా: ఆర్జీ కర్‌ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తున్నది. తన హయాంలో మెడికల్‌ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు సన్నిహితులైన ముగ్గురి నివాసాలపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. సందీప్‌ ఘోష్‌ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల2న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో కోర్టు ఆయనకు ఎనిమిది రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అంతకుముందు ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో 15 రోజులపాటు ఆయనను విచారించింది.

ఆగస్ట్ 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారం ఘటన జరిగిన కొన్ని గంటలకే కాలేజీ ప్రిన్సిపల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక పదవిలో నియమించింది. ఇక ట్రైయినీ డాక్టర్‌ హత్యాచార ఘటనపై విచారణ చేపట్టిన కోల్‌కతా హైకోర్టు.. ప్రొ. సందీప్ ఘోష్ సెలవుపై పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.