న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుందని ఈసీ పేర్కొంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో 13,776 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తొలి పురుష ఓటర్‌గా ఉమేష్ గుప్తా, తొలి మహిళా ఓటర్‌గా ప్రేరణ నిలిచారు. కరోల్ బాగ్ నియోజకవర్గంలో దర్యాన్ గంజ్ పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాలకుగానూ మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. హోమ్ ఓటింగ్ ద్వారా ఇదివరకే 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 19,000 మంది హోమ్ గార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది సహా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో ఎన్నికల కమిషన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది.
మరోవైపు డ్రోన్ కెమెరాలతో నిఘాను పెంచింది. పాతికేళ్ల తరువాత ఢిల్లీ పీఠం సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆప్ నేతలు ఎదురుచూస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఆప్ అధికారం లోకి వచ్చింది. కానీ తొలిసారి ఎన్నికల తరువాత కేవలం నెలన్నరకే ప్రభుత్వాన్ని రద్దు చేసి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. దాంతో వరుసగా రెండు టర్మ్‌లుగా ఢిల్లీలో ఆప్ పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.