తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమై డీఎస్సీ పరీక్షలు

DSC exam started all over Telangana

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్‌, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సెషన్ జరగనుంది. ఒక్కో సెషన్‌లో 13 వెల మంది చొప్పున రెండు సెషన్లకు కలిపి రోజుకు 26 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం 14 జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే ఎగ్జామ్‌ సెంటర్ల గేట్లను అధికారులు మూసివేశారు. ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించారు. ఉదయం ఏడున్నర నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోని అనుమతించారు. డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగడం ఇదే మొదటిసారికావడం విశేషం. రాష్ట్రప్రభుత్వం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటరిగిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.

కాగా, డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని అభ్యర్థులు పోరుబాటపట్టారు. ఉద్యోగార్థులు ఉధృతంగా ఉద్యమం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తున్నది. దీంతో 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, బుధవారం నాటికి 2,48,851 మంది మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మరో 31,105 మంది డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దమనకాండకు నిరసనగా వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. వందలాదిమంది డౌన్‌లోడ్‌ చేసుకున్న తమ హాల్‌టికెట్లను కాల్చివేసి నిరసన తెలిపారు. తమకు ప్రిపేరేషన్‌కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ.. ప్రభుత్వం పై మండిపడుతున్నారు.