కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ (75) గత కొంతకాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలో సీనియర్ రాజకీయవేత్తగా ధర్మపురి శ్రీనివాస్‌కు పేరు ఉంది. కాంగ్రెస్ దిగ్గజాలలో ధర్మపురి శ్రీనివాస్ ఒక్కరు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో 1948 సెప్టెంబర్ 27న జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ ఎన్‌ఏస్‌యూఐ కార్యకర్తగా చేరి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తుండగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపుమేరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. దివంగత నేత అర్గుల్ రాజారాం శిష్యుడిగా నిజామాబాద్ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ చక్రం తిప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిల క్యాబినెట్‌లలో పనిచేశారు.1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా డీఎస్ పనిచేశారు. 2004-2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా డీఎస్ పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా,వైయస్ రాజశేఖర్ రెడ్డి జోడీగా కలిసి పనిచేశారు. 2004లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రీయాశీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన ధర్మపురి శ్రీనివాస్ ఓటమి తధానంతరం హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ అకాల మరణం సమయంలో ఎమ్మెల్యేగా లేకపోవడంతో సీఎం పదవి ధర్మపురి శ్రీనివాస్‌కు తృటిలో జారిపోయింది. సోనియా గాంధీకి వీర విధేయుడిగా డీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా డీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా డీఎస్ పనిచేశారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో డీఎస్ అసంతృప్తికి గురయ్యారు. 2015లో కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.

ప్రభుత్వ సలహాదారుగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్‌కు ఇద్దరు తనయులు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ తండ్రి వెంటే కాంగ్రెస్‌లో ఉండి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా పనిచేశారు. రెండవ తనయుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా రెండోసారి ఎన్నికయ్యారు.