అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా వ్యవహారం కలకలం రేపింది. ఎస్సీ వర్గీకరణ సమస్యలపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు ప్రజల వినతిపత్రాలను స్వీకరించడంలో తలమునకలై ఉండగా, డీఆర్వో మాత్రం తనకు ఏసంబంధం లేదన్నట్లు తన మొబైల్ ఫోన్‌లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ పక్క మీటింగ్ జరుగుతుండగా డీఆర్వో తన మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఓ ఉన్నతాధికారి ఇలాంటి వ్యవహారం చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సమావేశానికి వచ్చిన వారు కూడా ఈ ప్రవర్తనను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ బాధ్యతలు నిర్లక్ష్యంగా వదిలేసి ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో మంచికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ వంటి ముఖ్యమైన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని రాజకీయ, సామాజిక వర్గాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పన్నుల డబ్బుతో పనిచేస్తున్న నేపథ్యంలో వారు ప్రజలకు సేవ చేయడంలో శ్రద్ధ వహించాలని, ఇటువంటి నిర్లక్ష్యపు చర్యలకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇంకా అధికారిక స్పందన రాలేదు.