- లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు
హైదరాబాద్ నగరంలో, అలాగే పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఫామ్ ప్లాట్ల పేరిట అనధికారిక లేఔట్లలో ప్లాట్ల విక్రయం జరుగుతున్నట్టు గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి తర్వాత రిజిస్ట్రేషన్ సమస్యలు తలెత్తుతాయని, ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఫామ్ ప్లాట్ల విక్రయంపై నిషేధం అమలులో ఉందని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్లాట్ల విక్రయం జరుగుతోందని, తాము దీనిపై దృష్టి సారించామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మీగూడ గ్రామ సర్వే నంబర్ 50లోని 1.02 ఎకరాల్లో ఫామ్ ప్లాట్ల పేరిట లేఔట్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఆయన వివరించారు. ఈ వివరాలను ఆరా తీసి, తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫామ్ ల్యాండ్ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. వీటిని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి అమ్మడం పూర్తిగా నిషేధించబడిందని తెలిపారు. ప్రజలు ఎవరైనా ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేయాలనుకుంటే, మొదట ఆ భూమికి సంబంధించి అనుమతులు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా పరిశీలించాలని ఆయన సూచించారు. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను విక్రయించడం ఒక చట్ట విరుద్ధ చర్య అని, దీనిని ప్రోత్సహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ సంపాదనను అనుమతులు లేని ప్లాట్ల కొనుగోలులో పెట్టి ఆర్థికంగా నష్టపోవద్దని హైడ్రా కమిషనర్ సూచించారు. ఫామ్ ల్యాండ్ విక్రయాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను అనుసరించాలని ఆయన హితవు పలికారు.