రుణమాఫీ నగదును ఇతర అప్పుల కింద జమచేయెద్దు: బ్యాంకర్లతో భట్టి

Do not deposit loan waiver cash under other debts: Bhatti with bankers

హైదరాబాద్‌: ఈరోజు నుండి మొదటి దశలో లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులను రుణవిముక్తి చేసే ప్రక్రియ మొదలు కానుంది. ఈ క్రమంలోనే నేడు ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు సమావేశం జరిగింది. ఈ భేటిలో రుణమాఫీపై బ్యాంకర్లతో భట్టి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలని బ్యాంకర్లకు సూచించారు. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దని చెప్పారు.

‘ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తాం. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 11లక్షల పైబడి రైతులకు రూ.6000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నాం. ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తాం. ఆ తర్వాత 2లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తాం. రెండు లక్షలపైన రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని… ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం.’ అని భట్టి విక్రమార్క అన్నారు.