డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

DK Shivakumar’s petition challenging CBI FIR dismissed by SC

న్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంపై శివకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. అయితే, ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ ఎస్‌సీ శర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

సీబీఐ కేసును రద్దు చేయాలని శివకుమార్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు. ఈ విషయంలో మూడునెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 2013-18 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శివకుమార్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లుగా సీబీఐ ఆరోపించింది. ఈ వ్యవహారంలో సీబీఐ 2020 సెప్టెంబర్‌ 3న కేసు నమోదు చేసింది. ఈ కేసును ఆయన కోర్టులో సవాల్‌ చేశారు.