ఏపిలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సు

District Collectors Conference started in AP

అమరావతి: ఏపీలో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించిందన్నారు. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే విధంగా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారుల మనో ధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బ తీసే విధంగా వ్యవహరించిందన్నారు. ఆంధ్ర ఆఫీసర్లు అంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారని… ఏపీలో పని చేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారని పేర్కొన్నారు. కానీ గత పాలన వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందని చెప్పారు. ఏపీ ఆఫీసర్లు అంటే అంటరాని వాళ్లను చూసినట్టు చూస్తున్నారని….ఏపీ అధికారులంటే ఏం చేయలేరు.. చేతకాని వాళ్లు అన్నట్టు ఢిల్లీలో అభిప్రాయం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

కాగా, వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా, అక్కడి ప్రజల స్థితిగతులపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఆధార్, రేషన్‌ కార్డులు, నివాస గృహాలు, తాగునీటి వసతులు, రహదారులు, వ్యవసాయం సహా అన్ని వివరాలనూ సేకరించనుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆగస్టు 7న సర్వే ప్రారంభించి 20వ తేదీలోపు పూర్తి చేయనుంది. బీసీలకు స్వయం ఉపాధి రుణాలను పునరుద్ధరించడంతో పాటు బీసీ భవన్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాయితీ రుణాల మంజూరుపై దృష్టి సారించింది. వర్గాల వారీగా చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. కలెక్టర్ల సదస్సులో సీఎం ఈ అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. శాఖల వారీగా వంద రోజుల్లో సాధించాల్సిన ప్రగతిపై లక్ష్యం నిర్దేశించనున్నారు.