ఏపీలో పింఛన్ల పంపిణీ షురూ..

కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 4వేలతో పాటు.. గత మూడు నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తం రూ. 7వేల పింఛన్ ను అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. తొలుత బానావత్ పాములు నాయక్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు .. వారికి పింఛన్ అందజేశారు. సుమారు అర్ధగంటపాటు వారి పూరిగుడిసెలోనే ఉండి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారి ఇంటి స్థితిగతులుచూసి చంద్ర‌బాబు చలించిపోయారు.

కూటమి సర్కార్ సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచింది. దీంతో లక్షలాది మంది వృద్ధుల్లో సంతోషాన్ని నింపింది ప్రభుత్వం. కేవలం వృద్ధులే కాదు.. వితంతువులు, దివ్యాంగులకు సైతం భారీ మొత్తంలో పెన్షన్లు పెంచి వారి జీవితాలకు మరింత భద్రత కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,408 కోట్లు విడుదల చేసింది. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 819 కోట్ల అదనపు ఖర్చు కానుంది.