టీటీడీ బోర్డు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి రద్దయింది. మొత్తం 24 మంది టీటీడీ బోర్డు సభ్యులు రిజైన్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మొత్తం 24 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని ఏర్పాటు చేసింది. వీరు కాకుండా నలుగురు ఎక్స్‌ ఆఫీషియో మెంబర్లను కూడా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు.

తాజాగా 24 మంది సభ్యులు రాజీనామా చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం వారందరి రాజీనామాలను ఆమోదించింది. ఈ మేరకు దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా.. పాలకమండలి సభ్యుల రాజీనామాల ఆమోదంతో టీటీడీకి కొత్త ఛైర్మన్‌ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది.

ఇదిలా ఉంటె తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు., ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని తెలిపారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి విషయంలో.. తక్కువ నాణ్యత ఉన్న నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.