అమరావతి : గన్నవరం ఎయిర్‌పోర్టును పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చి ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ల్యాండింగ్ ఇబ్బంది తలెత్తడంతో గాలిలోనే విమానం చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలముకుంది. పొగమంచు కారణంగా రహదారులపై పొగమంచు కమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది.
దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదని వాతావరణం అనుకూలించిన వెంటనే క్లియరెన్స్ ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి వచ్చిన విమానానికి ల్యాండింగ్ అయ్యేందుకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.
గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొడుతున్న వార్త తెలిసి ప్రయాణికుల బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా పార్క్ లైట్లు వేసుకుని వస్తే గానీ ముందర వచ్చే వాహనాలు కనబడే పరిస్థితి నెలకొంది. దగ్గరకు వచ్చే వరకు కూడా వాహనాలు ఏంటి అనేది తెలియక వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాహనాలను జాగ్రత్తగా, అతి నెమ్మదిగా నడుపుతూ ముందుకు వెళ్తున్నారు వాహనదారులు. పొరపాటున ఎదురు వాహనాలను కనబడకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.