ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

నాల్గు రోజుల క్రితం ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు తన భూమిని కొంతమంది కబ్జా చేసారని..దీనిపై అధికారుల దగ్గరికి వెళ్లిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసందే. ఆదివారం ప్రభాకర్ కుటుంబాన్ని భట్టి విక్రమార్క పరామర్శించిన అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఎంత పెద్ద సమస్య ఉన్న ఎక్కడో ఒకచోట పరిష్కారం మార్గం వెతుకొని బతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసారు. రైతును ఆత్మహత్యకు పురిగొల్పి.. దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే.. నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులైన వారి పైన చట్టపరంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించానని తెలిపారు.

ఇక్కడ అందరూ మా వాళ్లే.. అందరూ నా వాళ్లే.. జరిగిన పొరపాటుకు ఎవరూ కారణమైన సరే.. ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నారు. బాధిత కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం జరిగేటట్టుగా .. రైతు ప్రభాకర్ భూమికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం హామీ ఇచ్చారు. చేపల సొసైటీ, ఇరిగేషన్, రెవెన్యూ వారితో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని.. శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ను ఆదేశించాను అన్నారు. పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు పూర్తిగా ఏర్పాటు చేస్తానని, పిల్లలు బాగా చదువుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. వారు చదువుకున్నంత కాలం చదివిస్తాను ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.