శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భట్టి

సోమవారం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కాంగ్రెస్ మ్మెల్యే లతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని రుతుపవనాలు మెండుగా రావాలని కరువు, కాటకాలు లేకుండా చూడాలని పంటలు బాగా పండాలని మల్లన్నస్వామిని వేడుకున్నానని తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అధికారులతో విద్యుత్ ఉత్పత్తిపై చర్చించడానికి శ్రీశైలం వచ్చానని చెప్పారు. ‘నాటి కాంగ్రెస్ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నిండాయి. శ్రీశైలంలో అత్య ధిక విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం. 2030 వరకు కావాల్సిన విద్యుత్ మాకు అందుబాటులో ఉంది’ అని ఆయన తెలిపారు.